తిరుపతి / దేవుని కడప, ఆగస్టు 26, 2026: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణం బుధవారం ఆగమ సంప్రదాయాల ప్రకారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు.
మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణం
ఆలయ పునరుద్ధరణ క్రతువుల్లో భాగంగా ఉదయం 7 గంటలకు చతుష్ఠానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు.
అనంతరం ఉదయం 9:45 గంటల నుంచి 11:30 గంటల వరకు మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణం, కలాకర్షణం నిర్వహించారు.
శ్రవణ నక్షత్రం, తులా లగ్నంలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు మహాసంప్రోక్షణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆలయ పవిత్రత, వైభవం పునరుద్ధరించబడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
భక్తులకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభం
మహాసంప్రోక్షణ క్రతువులు పూర్తయిన అనంతరం శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి దర్శనాన్ని భక్తులకు పునఃప్రారంభించారు.
వొంటిమిట్టలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ ఈవో
అంతకుముందు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర వొంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు ఈవోకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వొంటిమిట్ట ఆలయ ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని ఈవోకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో డా. ఎ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు