తిరుపతి, జూలై 16, 2026: జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా శ్రీనివాస మంగాపురంలోని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం అనంతరం ఉదయం 6.00 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుభ్రపరిచారు.
తరువాత శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, గంధం, కర్పూరం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా చల్లి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.
భక్తులకు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి దర్శనం కల్పించారు.
మూడు రోజుల వాహన సేవలు
సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించనున్నారు.
- జూలై 17: పెద్దశేష వాహనం
- జూలై 18: హనుమంత వాహనం
- జూలై 19: గరుడ వాహనం
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని టీటీడీ కోరింది.
ఆలయానికి తెరల విరాళం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ నరసింహులు ఆలయానికి కొత్త తెరలను విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్, అర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు