తిరుమల, జూలై 18, 2026: తిరుమల శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మారీచి మహర్షి తిరునక్షత్రోత్సవం శనివారం సాయంత్రం తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించారు.
వైఖానస సంప్రదాయానికి మారీచి మహర్షి సేవలు
ఈ సందర్భంగా సభ అధ్యక్షులు శ్రీ దీవి రాఘవ దీక్షితులు మాట్లాడుతూ, వైఖానస శాస్త్ర ప్రవర్తకుడు విక్ఖనస మహర్షి ప్రధాన శిష్యుల్లో మారీచి మహర్షి ఒకరని తెలిపారు.
శ్రీవారి ఆలయంలో నేటికీ అమలవుతున్న పూజా విధానాలను నిర్దేశించే విమానార్చన కల్పం గ్రంథ రచయిత మారీచి మహర్షేనని ఆయన వివరించారు.
వేలాది సంవత్సరాలుగా తిరుమలలో వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆరాధన కొనసాగుతోందని, విమానార్చన కల్పం మరియు ఆనంద సంహితలో పేర్కొన్న విధానాలే నేటికీ ఆలయ పూజా సంప్రదాయాలకు మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పారు.
వైఖానస ఆగమ ప్రాముఖ్యతను వివరించిన పండితులు
ఈ సందర్భంగా శ్రీ గంజాం ప్రభాకరాచార్యులు, శ్రీ యశ్వంత్ దీక్షితులు, శ్రీ శేషసాయి, శ్రీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ వైఖానస ఆగమం, సనాతన ధర్మ పరిరక్షణ, అలాగే తిరుమలలోని పంచబేరాల ఆరాధన సంప్రదాయం యొక్క విశిష్టతను వివరించారు.
కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, వైఖానస పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు