తిరుమల, ఆగస్టు 6, 2026: తిరుమలలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరగనున్న జంట శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
గురువారం తిరుమలలోని సుధర్మ కాన్ఫరెన్స్ హాల్‌లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.
టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి అదనపు ఈవో ఏర్పాట్లను సమీక్షించారు.
అదనపు ఆర్టీసీ బస్సులు
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు.
భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక పార్కింగ్ ప్లాన్
వాహనాల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి కేటాయించాలని సూచించారు.
భక్తులకు పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్స్
బ్రహ్మోత్సవాల్లో భారీ రద్దీ నేపథ్యంలో చిన్నారులు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి తప్పిపోకుండా చైల్డ్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్‌ను విస్తృతంగా పంపిణీ చేయాలని సూచించారు.
విద్యుత్, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి
బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసే విద్యుత్ కేబుల్స్, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు.
ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
అదేవిధంగా అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, అవసరమైన పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
గరుడసేవ, చక్రస్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే గరుడ వాహన సేవ, చక్రస్నానం వంటి ముఖ్యమైన రోజులపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ నిర్వహణ, రవాణా, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా గరుడసేవ రోజున భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేసినట్లు జేఈవో తెలిపారు.
25 రాష్ట్రాలతో పాటు సింగపూర్, జర్మనీ కళాకారులు
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నాయి.
అంతేకాకుండా సింగపూర్, జర్మనీకి చెందిన కళాకారులను కూడా ఆహ్వానించినట్లు జేఈవో వెల్లడించారు. వారి ప్రదర్శనలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష
బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సీవీఎస్వో, తిరుపతి జిల్లా ఎస్పీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో టీటీడీ ఇన్‌ఛార్జ్ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ భాస్కర్, సీఎంవో డాక్టర్ కుసుమ కుమారి, డీఎఫ్‌వో శ్రీ ఫణికుమార్ నాయుడు, తిరుమల ఏఎస్పీ శ్రీ రామకృష్ణ, వీజీవో శ్రీ సురేంద్రతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు