తిరుమల, ఆగస్టు 25, 2026: పవిత్రమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులను ఆహ్వానించేందుకు తిరుమల సిద్ధమవుతున్న నేపథ్యంలో, టీటీడీ ఆరోగ్య విభాగం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి మంగళవారాన్ని “క్లీనింగ్ డే”గా పాటించనున్నారు.
పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి
టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్యకరమైన ఆహారం అందించడంతో పాటు తిరుమలలో పారిశుద్ధ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలకు ప్రతి మంగళవారం డీప్ క్లీనింగ్
కొన్ని ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో పారిశుద్ధ్యంపై ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో శ్రీ సోమనారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలను మూసివేసి డీప్ క్లీనింగ్ నిర్వహించాలని దుకాణ నిర్వాహకులను ఆదేశించారు.
ఈ సమయంలో పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించడం, పరిసరాలను శానిటైజ్ చేయడం, పురుగుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుంది.
థర్డ్ చౌల్ట్రీ, పీఏసీల్లో ప్రత్యేక శుభ్రత
క్లీనింగ్ డేలో భాగంగా మంగళవారం థర్డ్ చౌల్ట్రీ, పీఏసీ-1, పీఏసీ-2తో పాటు ఇతర ప్రాంతాల్లోని ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో డీప్ క్లీనింగ్ చేపట్టారు.
ఆహార కేంద్రాల నిర్వాహకులు ఆహార తయారీ, నిల్వ, వడ్డింపు సమయంలో కఠినమైన పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని, పరిసరాలను పురుగులు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్య శాఖ ఇన్‌స్పెక్టర్లు సూచించారు.
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
పారిశుద్ధ్య నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఆరోగ్య విభాగం హెచ్చరించింది.
తిరుమలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, భక్తులకు ఆహ్లాదకరంగా ఉంచేందుకు భక్తులు, దుకాణ నిర్వాహకులు, సిబ్బంది అందరూ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
💬 వ్యాఖ్యలు