తిరుమల, ఆగస్టు 14, 2026: తిరుమల శ్రీవారి దర్శనం, అర్జిత సేవలు, వసతి బుకింగ్స్ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ మరోసారి హెచ్చరించింది.
నకిలీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భక్తులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
కొంతమంది మోసగాళ్లు టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలను నిర్వహిస్తూ శ్రీవారి దర్శనం, అర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్స్‌ను ఏర్పాటు చేస్తామంటూ భక్తులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఈ తరహా మోసాలకు సంబంధించి టీటీడీకి అనేక ఫిర్యాదులు అందాయి.
గతంలో కూడా ఇలాంటి నకిలీ సందేశాలు, వెబ్‌సైట్లు, అనధికార బుకింగ్ ఆఫర్లను నమ్మవద్దని టీటీడీ పలుమార్లు భక్తులను హెచ్చరించింది.
అధికారిక టీటీడీ మార్గాల్లోనే బుకింగ్స్ చేసుకోవాలి
నకిలీ వెబ్‌సైట్లపై వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, భక్తులు దర్శనం, సేవలు, వసతి బుకింగ్స్‌ను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా అధికారిక టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చే అనధికార బుకింగ్ లింకుల పట్ల భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
సైబర్ మోసాలపై టీటీడీ ప్రత్యేక నిఘా
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఐటీ, విజిలెన్స్ విభాగాలు, సైబర్ క్రైమ్ పోలీసులు, ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
ఇలాంటి నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను గుర్తించి తొలగించడం, బ్లాక్ చేయడం, దర్యాప్తు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గత రెండేళ్లలో 259 నకిలీ వెబ్‌సైట్లను గుర్తించి తొలగించారు. ఈ వెబ్‌సైట్లతో సంబంధం ఉన్న పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.
టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, మేధో సంపత్తిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్‌మార్క్, సైబర్ చట్టాల కింద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
భక్తులకు టీటీడీ సూచనలు
- టీటీడీ సేవలు, దర్శనం, వసతి బుకింగ్స్‌ను అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.
- వాట్సాప్ ద్వారా వచ్చే అనధికార బుకింగ్ సందేశాలు, లింకులను నమ్మకూడదు.
- టీటీడీ పేరుతో నిర్వహిస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా పేజీలను నమ్మి మోసపోవద్దు.
- బుకింగ్స్ పేరుతో తెలియని వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయకూడదు.
- టీటీడీ పేరు లేదా లోగో ఉపయోగిస్తున్న ఏదైనా వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా ఖాతాను సంప్రదించే ముందు అది అధికారిక ప్లాట్‌ఫారమ్ కాదా అని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ సందేశాల ద్వారా జరిగే సైబర్ మోసాలకు భక్తులు గురికాకుండా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని టీటీడీ మరోసారి సూచించింది.
💬 వ్యాఖ్యలు