శ్రీవారి ఆలయ కైంకర్యాలకు రామానుజాచార్యుల విధానాలే పునాది – తిరుపతిలో జాతీయ సదస్సు ప్రారంభం

తిరుపతి, ఆగస్టు 17, 2026: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యులు నిర్దేశించిన కైంకర్య విధానాలు నేటికీ సక్రమంగా కొనసాగుతున్నాయని…

✍ Admin · 📅 18 Aug 2026 · ⏱ 1 min read · 👁 11
Ramanujacharya’s Kainkarya Traditions Continue to Guide Srivari Temple Services

తిరుపతి, ఆగస్టు 17, 2026: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యులు నిర్దేశించిన కైంకర్య విధానాలు నేటికీ సక్రమంగా కొనసాగుతున్నాయని తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి తెలిపారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” అనే అంశంపై జాతీయ సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సు ఆగస్టు 19 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది.

తిరుమల ఆలయ సంప్రదాయాల్లో రామానుజాచార్యుల విశేష సేవలు

తిరుమల పెద్ద జీయర్ స్వామి అనుగ్రహ సందేశం అందిస్తూ, తిరుమల శ్రీవారి ఆలయంలోని నిత్య కైంకర్యాలతోపాటు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, ఇతర దివ్యదేశాల్లో శ్రీ రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన కైంకర్య వ్యవస్థ నేటికీ కొనసాగుతోందని తెలిపారు.

తిరుమలలో నాలుగు మాడ వీధులను ఏర్పాటు చేసి, శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థను బలోపేతం చేశారని చెప్పారు.

కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ భగవంతుని సేవలో భాగస్వామ్యం కల్పించిన మహోన్నత ఆచార్యులు శ్రీ రామానుజాచార్యులు అని పెద్ద జీయర్ స్వామి పేర్కొన్నారు.

శ్రీవారి నిత్య కైంకర్యాలను వ్యవస్థీకృతం చేసిన రామానుజాచార్యులు

తిరుమల చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీ రామానుజాచార్యులు సాక్షాత్తు ఆదిశేషుని అవతారమని, శ్రీవారికి నిత్య కైంకర్యాలను వ్యవస్థీకృతం చేసిన మహనీయుడని తెలిపారు.

రామానుజాచార్యులు శుక్రవారం అభిషేకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు శంఖచక్రాల ప్రతిష్ఠను నిర్వహించారని చెప్పారు.

తిరుమలలో నిర్వహించే ప్రతి సేవలో ఆళ్వార్ల పాశురాలు ఉండేలా ప్రత్యేక విధానాన్ని అమలు చేశారని తెలిపారు.

శ్రీ రామానుజాచార్యుల మేనమామ తిరుమల నంబి శ్రీవారికి నిత్య కైంకర్యాలు నిర్వహించగా, అనంతాళ్వారు పుష్ప కైంకర్యంలో విశేష సేవలు అందించారని వివరించారు.

శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణలో ఆచార్యుల సేవలు

ఆళ్వార్ ప్రాజెక్టు విశ్రాంత ప్రత్యేకాధికారి డా. మాడభూషి వరదరాజన్ మాట్లాడుతూ, ఆచార్య పుండరీకాక్షులు శ్రీమన్నాథమునుల శిష్యపరంపరలో ప్రముఖులని తెలిపారు.

ఆళ్వారుల నాలాయిర దివ్యప్రబంధ పారాయణాన్ని దేవాలయాల్లో వ్యవస్థీకృతంగా నిర్వహించే సంప్రదాయాన్ని వైష్ణవ దివ్యదేశాల్లో విస్తరించారని చెప్పారు.

పుండరీకాక్షులు నెలకొల్పిన ఈ పారాయణ సంప్రదాయం నేటికీ కొనసాగుతోందని, వారి ఆధ్యాత్మిక సేవలు శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు.

రామానుజులు, ఎంబార్ గురుకుల సహాధ్యాయులు

భగవద్ రామానుజులు, శ్రీ గోవింద భట్టర్ (ఎంబార్) తిరుప్పుట్కుళి గురుకులంలో సహాధ్యాయులుగా విద్యాభ్యాసం చేశారని డా. వరదరాజన్ తెలిపారు.

అనంతరం రామానుజులు తిరుమల నంబి వద్ద అలిపిరిలో ఒక సంవత్సరం పాటు శ్రీరామాయణ కాలక్షేపాన్ని శ్రవణం చేశారని చెప్పారు.

ఎంబార్ శ్రీ రామానుజులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారని తెలిపారు.

అదేవిధంగా శ్రీ దాశరథి (ముదళియాండాన్) శ్రీరంగం దేవస్థాన నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు విశేష సేవలందించారని వివరించారు.

నాథముని – పుండరీకాక్షుల ఆధ్యాత్మిక సేవలు

హైదరాబాద్‌కు చెందిన శ్రీ పరాకాలన్ స్వామిశ్రీమాన్ నాథముని–పుండరీకాక్షుల ఆధ్యాత్మిక సేవలు” అనే అంశంపై ప్రసంగించారు.

శ్రీ నాథముని మహర్షి శ్రీ వైష్ణవ సంప్రదాయానికి బలమైన పునాదులు వేసిన ప్రముఖ ఆచార్యులలో ఒకరని తెలిపారు.

ఆళ్వార్ల 4,000 పాశురాలను సేకరించి “నాలాయిర దివ్యప్రబంధం”గా క్రోడీకరించి భక్తి సాహిత్యానికి విశిష్ట సేవలందించారని చెప్పారు.

నాథముని శిష్యుల్లో పుండరీకాక్షులు ప్రముఖులుగా నిలిచి గురువు బోధనలను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.

గురుభక్తి, వినయం, కైంకర్య నిష్ఠకు పుండరీకాక్షుల జీవితం ఆదర్శమని శ్రీ పరాకాలన్ స్వామి పేర్కొన్నారు.

ఆచార్యుల సేవలపై పండితుల ప్రసంగాలు

మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీ రాఘవన్ స్వామి, తిరువల్లిక్కేని శ్రీ శ్రీనివాసన్ స్వామి, చెన్నైకి చెందిన శ్రీ రంగరాజన్, శ్రీ మాధవన్ స్వామి శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు, శ్రీవారి కైంకర్య సంప్రదాయాలు, విశిష్టాద్వైత తత్వం, ఆళ్వార్ల పాశురాల ప్రాధాన్యంపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా పలువురు పండితులు పరిశోధనా పత్రాలను సమర్పించారు.

కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ తిరుమళిశై ఆళ్వార్, పండితులు, పరిశోధకులు, పెద్ద సంఖ్యలో పురప్రజలు పాల్గొన్నారు.

భాషను మార్చండి: 🇬🇧 English 🇮🇳 తెలుగు
🛕 ఈ సమాచారం ఉపయోగపడిందా? ఇతర భక్తులకు పంచుకోండి — వారు కూడా దర్శనం పొందాలి.
📣 షేర్ చేయండి Telegram 𝕏 Facebook

✉️ తిరుమల వార్తల న్యూస్‌లెటర్

రోజువారీ దర్శనం అప్‌డేట్‌లు, పండుగ రిమైండర్‌లు, టోకెన్ విడుదల అలర్ట్‌లు — నేరుగా మీ ఇన్‌బాక్స్‌లో.

స్పామ్ లేదు. 1 క్లిక్‌లో అన్‌సబ్‌స్క్రైబ్.

💬 వ్యాఖ్యలు

మొదటి వ్యాఖ్య మోడరేషన్ తర్వాత కనిపిస్తుంది
⏳ లోడ్ అవుతోంది…
© 2026 Tirumalainfo.com · All news · 📚 Saved · Live status · Terms · Privacy