తిరుమల, సెప్టెంబరు 08, 2026: తిరుమల శ్రీవారి ఆలయ మహా గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని టీటీడీ సిబ్బంది ముందుగానే గుర్తించారని టీటీడీ స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోలేదని తెలిపింది.
గోపురంపై వందలాది విగ్రహాలు
శ్రీవారి ఆలయ మహా గోపురంపై వందలాది విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. ఇవి దీర్ఘకాలంగా ఎండ, వర్షం వంటి సహజ పరిస్థితులకు గురవుతుండటంతో కొన్ని విగ్రహాలకు కాలక్రమంలో మరమ్మతులు అవసరమయ్యే అవకాశం ఉంటుందని టీటీడీ తెలిపింది.
ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు చేపడుతున్న సమయంలో అక్కడ ఉన్న విగ్రహాల పరిస్థితిని కూడా టీటీడీ సిబ్బంది పరిశీలిస్తారు.
అవసరాన్ని బట్టి మరమ్మతులు లేదా కొత్త విగ్రహాల ఏర్పాటు
విగ్రహాల పరిస్థితిని పరిశీలించిన అనంతరం అవసరాన్ని బట్టి మరమ్మతులు చేపట్టడం లేదా మరమ్మతులు చేయలేని విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం టీటీడీ చేపడుతోందని తెలిపింది.
ఇదే క్రమంలో ప్రస్తుతం గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి మరమ్మతులు అవసరమైన విషయాన్ని టీటీడీ సిబ్బంది గుర్తించారు.
విషయం గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.
ఘటనపై దుష్ప్రచారం చేయవద్దని టీటీడీ సూచన
ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోకుండా దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సరికాదని టీటీడీ స్పష్టం చేసింది.
ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాలపై భక్తుల్లో అపోహలు, ఆందోళనలు కలిగించేలా దుష్ప్రచారం చేయవద్దని టీటీడీ హితవు పలికింది.
వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే సమాచారం
శ్రీవారి ఆలయం వంటి అత్యంత పవిత్రమైన ప్రదేశానికి సంబంధించిన విషయాలపై వాస్తవాలను నిర్ధారించుకోకుండా ప్రచారం చేయడం వల్ల భక్తుల్లో అనవసరమైన ఆందోళన ఏర్పడే అవకాశం ఉందని టీటీడీ సూచించింది.
ఆలయ గోపురంపై విగ్రహాల నిర్వహణ, మరమ్మతులు నిరంతరం జరిగే సాధారణ సంరక్షణ ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేసింది.
💬 వ్యాఖ్యలు