తిరుమల, ఆగస్టు 16, 2026: ఈ నెలలో తిరుమల శ్రీవారి భక్తులకు రెండుసార్లు గరుడసేవను వీక్షించే అవకాశం లభించనుంది. ఆగస్టు 17, 28 తేదీల్లో గరుడ వాహన సేవలను నిర్వహించనున్నారు.
ఆగస్టు 17న గరుడ పంచమి గరుడసేవ
గరుడ పంచమి సందర్భంగా ఆగస్టు 17, సోమవారం తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు తమకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో శ్రావణ పౌర్ణమి ఆగస్టు 28న నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.
అదే రోజు ట్రయల్ రన్ గరుడసేవ
తిరుమలలో వార్షిక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.
సంప్రదాయం ప్రకారం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి సంవత్సరం ట్రయల్ రన్ గరుడసేవను నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరిగే ఆగస్టు 28ననే ట్రయల్ రన్ గరుడసేవను కూడా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా వచ్చే నెలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల కోసం నాలుగు మాడ వీధుల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఇంజినీరింగ్ ఏర్పాట్లను టీటీడీ ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు.
💬 వ్యాఖ్యలు