తిరుమల, నవంబర్ 5, 2026: తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ చ. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణతో కలిసి గురువారం సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు విస్తృతంగా, పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు.
గత ఏడాది 7.83 లక్షల మంది భక్తులకు దర్శనం
గత ఏడాది వైకుంఠ ద్వార దర్శన సమయంలో 7.83 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అదనపు ఈవో గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు మొదటి మూడు రోజులకు ఆన్‌లైన్ ఈ-డీఐపీ ద్వారా ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కేటాయించాలని ఆదేశించారు. మిగిలిన ఏడు రోజుల పాటు సర్వదర్శనం కల్పించనున్నారు.
డిసెంబర్ 25న ప్రత్యేక సర్వదర్శనం ఏర్పాట్లు
డిసెంబర్ 25న శ్రీవారి అభిషేకం సందర్భంగా సర్వదర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు.
క్యూలైన్లను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
భద్రత, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి
వైకుంఠ ద్వార దర్శనంలోని చివరి ఏడు రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున విస్తృతమైన భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేపడతామని సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు