తిరుపతి, ఆగస్టు 21, 2026: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరి వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు, అభిషేకాలు
వరలక్ష్మీ వ్రతంలో భాగంగా సుప్రభాతం, సహస్రనామార్చన, అభిషేకం, విష్వక్సేన ఆరాధన, కలశ స్థాపన, లక్ష్మీ సహస్రనామార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
శ్రీ పద్మావతి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించి, సంప్రదాయ పుష్పాలతో విశేషంగా పూజించారు. 12 రకాల నైవేద్యాలు సమర్పించిన అనంతరం మహా మంగళహారతితో వ్రతం ముగిసింది.
మహిళలకు ఎంతో విశిష్టమైన వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించే మహిళలకు ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, సంతానం, దీర్ఘ సుమంగళిత్వం లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు.
శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభప్రదమని వారు పేర్కొన్నారు.
భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు
వరలక్ష్మీ వ్రతానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరైన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు.
భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ, ప్రసాదం అందుబాటులో ఉంచారు.
కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఆకట్టుకున్న వైభవమైన పుష్పాలంకరణ
టీటీడీ ఉద్యానవన విభాగం ఆలయం, వ్రత మండపాన్ని దాదాపు 3 టన్నుల సంప్రదాయ పుష్పాలతో, 14 రకాల 30,000 కట్ ఫ్లవర్స్‌తో సుందరంగా అలంకరించింది.
గజలక్ష్మి, ఐరావతాలు, అష్టలక్ష్మి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భక్తులు వేడుకలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల్లో 7 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఊరేగింపు
సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ వేడుకల్లో టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
💬 వ్యాఖ్యలు